ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో వారసుడు క్రిస్టియానో జూనియర్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన తొలి అడుగుల్ని వేసాడు. వ్లాట్కో మార్కోవిక్ అండర్-15 టోర్నమెంట్‌లో పోర్చుగల్ యువ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడి ఫుట్‌బాల్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. జపాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 4-1 తేడాతో విజయం సాధించింది.
క్రీడా ప్రపంచంలో రొనాల్డో చేసిన రికార్డులెన్నో. ఇప్పుడు అదే దిశగా ఆయన కుమారుడు కూడా ప్రయాణం మొదలుపెట్టడం ఆయన అభిమానుల్లో ఆనందం నింపుతోంది. జూనియర్ రొనాల్డో పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చూసిన క్రిస్టియానో రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందిస్తూ, “బిడ్డా.. నీ అరంగేట్రానికి అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఉంది” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
మ్యాచ్ అనంతరం జూనియర్ చుట్టూ అభిమానులు ముస్తాబై సెల్ఫీల కోసం పోటీపడ్డారు. తండ్రి తరహాలోనే నెం.7 జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగిన క్రిస్టియానో జూనియర్ ఆటతీరుతో అభిమానులను మెప్పించాడు. క్రీడా విశ్లేషకులు కూడా అతడి ఆటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పుడే ప్రారంభమైన ఈ ప్రయాణం అతడిని భవిష్యత్తులో తన తండ్రిని మించిన ఆటగాడిగా నిలిపే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు. రొనాల్డో వారసుడిగా కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే విధంగా జూనియర్ రొనాల్డో ముందుకు సాగాలని ఫుట్‌బాల్ ప్రపంచం ఎదురుచూస్తోంది.