‘ఓ మంచి ఘోస్ట్‌’గా వస్తున్న వెన్నెల కిషోర్‌

వెన్నెల కిషోర్‌, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్‌’ . ఈ మధ్య హారర్‌, కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో తెలిసిందే. థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ ఈ జానర్‌ సినిమాలు మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. ఇప్పుడీ సినిమా కూడా అదే జానర్‌లో రాబోతోంది. కామెడీ స్పెషలిస్ట్‌ వెన్నెల కిషోర్‌, హారర్‌ స్పెషలిస్ట్‌ నందితా శ్వేత కలిసి నటిస్తోన్న ఈ సినిమా మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సూపర్‌ కాంబినేషన్‌లో ‘ఓ మంచి ఘోస్ట్‌’ సినిమాను జూన్‌ 21న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘ఓ మంచి ఘోస్ట్‌’ చిత్రంలో షకలక శంకర్‌, నవమి గాయక్‌, నవీన్‌ నేని, రజత్‌ రాఘవ్‌, హాస్యనటుడు రఘుబాబు తదితరులు ఇతర పాత్రలలో నటించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందగా.. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌, లిరికల్‌ సాంగ్‌, టీజర్‌లు మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. చిత్ర విజయంపై టీమ్‌ అంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు.