అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, రమణ గోగుల సాంగ్ హిట్ అవటంతో సినిమా పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించిన తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో వెంకటేష్ ఒక పాటని పాడబోతున్నాడు.
అదే విషయాన్ని కామెడీగా వీడియో రూపంలో మన ముందుకి తీసుకువచ్చారు అనిల్ రావిపూడి అండ్ టీం. మొదటి పాట రమణ గోగుల అద్భుతంగా పాడారు, రెండవ పాట భీమ్స్ పాడారు, మూడో పాట ఎవరితో పాడించాలి అని తన టీం తో డిస్కషన్స్ చేస్తూ ఉంటాడు అనిల్ రావిపూడి. అప్పుడే నేను పాడతా, నేను పాడతా అంటూ అక్కడికి వస్తారు వెంకటేష్. ఆశ్చర్యంగా చూడటం అనిల్ రావిపూడి వంతు అవుతుంది. అయితే మూడవ పాట సింగర్ గురించి డిస్కషన్స్ చేస్తున్న ప్రతిసారి వెంకటేష్ నేను పాడతాను అంటూ అతడిని ఫ్రస్టేషన్ కి గురి చేస్తూ ఉంటాడు.
చివరికి విసిగిపోయిన అనిల్ రావిపూడి వెంకటేష్ గారితో పాట పాడించమని బీమ్స్ తో చెప్పటం తర్వాత వెంకటేష్ పాట పాడుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. చాలా ఫన్నీగా సాగిన ఈ వీడియో సినిమాపై మరింత క్రేజ్ ని పెంచింది. అంతేకాకుండా వెంకటేష్ ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాలో పాట పాడటం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. వెంకటేష్ మొదటిసారిగా గురు సినిమాలో పాట పాడిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ పాట అప్పట్లో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు కూడా వెంకటేష్ సాంగ్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు మూవీ యూనిట్. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాలో వెంకటేష్ ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా ఐశ్వర్య రాజేష్ అతనికి భార్యగా, మీనాక్షి చౌదరి అతనికి ప్రియురాలుగా నటిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.