రాత్రి రెండు దాటినా ఇంటికి పోని మెగా హీరో.. అంత‌సేపు ఏం చేస్తున్నాడో మ‌రి!

సినిమా స్టార్స్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో అంద‌రికి తెలిసిందే. ఒక్కోసారి తిండితిప్ప‌లు నిద్రాహారాలు కూడా లేకుండా చిత్రీక‌ర‌ణలో పాల్గొంటూ ఉంటారు. ఇందుకు కార‌ణం టైట్ షెడ్యూల్స్ ఫిక్స్ చేయ‌డం అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇలాంటి సంద‌ర్భాలు రేర్‌గా వ‌స్తాయ‌నుకోండి. ఇప్పుడు క‌రోనా వ‌ల‌న ఏడెనిమిది నెల‌లుగా షూటింగ్స్ అన్ని స్తంభించ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు జెట్ స్పీడ్‌తో ఇంత‌క ముందు మొద‌లు పెట్టిన ప్రాజెక్టుల‌ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇందులో భాగంగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న బాక్స‌ర్ మూవీ షూటింగ్‌ని శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు.

ప్ర‌స్తుతం బాక్స‌ర్ చిత్ర షూటింగ్ కోవిడ్ 19 నిబంధ‌న‌లు పాటిస్తూ కొద్ది మంది టీం మ‌ధ్య జ‌రుగుతుంది. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తుండ‌గా, అర్ధ‌రాత్రులు కూడా షూటింగ్స్ నిర్వ‌హిస్తున్నార‌ట‌. రాత్రి రెండు దాటుతున్నా కూడా తాను సెట్స్‌లోనే ఉన్న విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఇన్నాళ్ళు ఇంట్లో సుఖంగా ఉన్న మ‌న కొణిదెల హీరో ఇప్పుడు సెట్స్‌లో నిద్రాహారాలు మాని క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం వరుణ్ ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్‌ మెళకువలు నేర్చుకున్నాడు.

బాక్స‌ర్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేక‌ర్‌.. వ‌రుణ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు వెంక‌టేశ్‌, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చ ఏడాది చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ ఒక‌వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మ‌రోవైపు డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న త‌న చెల్లి పెళ్లికి సంబంధించిన ప‌నుల‌న్నింటిని చూసుకుంటున్నాడు.