మార్పు తీసుకొచ్చే నాయకుడికి మద్దతు.. విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఉపాసన!

తన పనులు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండే మెగా కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తన యాక్టివిటీస్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతోపాటు రాజకీయం గురించి కూడా మాట్లాడారు. తాను మాత్రం రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. మార్పు తీసుకువచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. తమిళనాడులో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ఆమె స్పందించారు… ”సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారు.

ముఖ్యమంత్రులుగా సేవలందించారు. విజయ్‌ నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్‌ ఎవరైనా సపోర్ట్‌ చేయాలనేది నా అభిప్రాయం. ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్‌ చేయకపోయినా.. వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్‌ గొప్ప రాజకీయనాయకుడు అవుతారని భావిస్తున్నానని” అన్నారు.

అయితే ఇప్పటి దాకా ఉపాసన తన చిన్న మావయ్య పవన్‌ కల్యాణ్‌, జనసేన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు విజయ్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె మాటల్ని దాన్ని బట్టి చూస్తే పవన్‌ కళ్యాణ్‌ కు కూడా సపోర్ట్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమాల గురించి చెబుతూ ‘నేను తెలుగు, తమిళ సినిమాలను సబ్‌ టైటిల్స్‌తో చూస్తాను.

ఈ మధ్య అలా చాలా చిత్రాలను చూసి ఎంజాయ్‌ చేశా. ఈ ఏడాది రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’,’ఇండియన్‌ 2’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.’గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ సమయంలోనే మాకు పాప పుట్టింది. అందుకే ఆ చిత్రం మాకు ప్రత్యేకం. చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ వచ్చిన తర్వాత ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌కి వెళితే.. అక్కడ అందరూ నాటునాటు స్టెప్‌ వేసి అలరించారు. అది చూసి చాలా ఆనందమేసిందని తెలిపారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా కథానాయిక.