పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. చేతిలో వున్న ‘హరి హర వీర మల్లు’ పూర్తి చేసి, ఆ తర్వాత గానీ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. అన్నట్టు, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ కూడా ప్రారంభోత్సవం జరుపుకుందాయె. ఇంకోపక్క ‘వినోదయ సితం’ సినిమా వ్యవహారాలూ తెరవెనుకాల వేగంగా నడుస్తున్నాయి.
మరి, హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి.? తమిళ ‘తెరి’ నుంచి మెయిన్ పాయింట్ తీసుకుని, ఫ్రెష్ ట్రీట్మెంట్ చేస్తున్నారట. తాజాగా, ఈ ట్రీట్మెంట్ వ్యవహారాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కొంత సాయం చేస్తున్నాడని తెలుస్తోంది.
ఓ వైపు మహేష్‌తో సినిమా చేస్తూ, ఇంకో వైపు ఏకంగా మరో రెండు సినిమాలకి (పవన్ కళ్యాణ్‌వే) రచన పరంగా సహకారం అందిస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘వినోదయ సితం’ సినిమాకి త్రివిక్రమ్ ‘అవసరం’ బహిరంగ రహస్యమే.