టాలీవుడ్ బాక్సాఫీస్ దూకుడు ప్రతీ ఏడాదికో కొత్త మైలురాయి చాటుతుండగా, 2026 మాత్రం పూర్తిగా రికార్డుల వర్షానికి వేదికకాబోతుందన్న మాటే వినిపిస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలు ఒక్కొక్కరు తమ బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్‌లో పెడుతూ ప్రేక్షకుల అంచనాలను మోత మోగిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ సాక్షాత్తూ ఒక పండుగలా మారనుంది. ఇక సంక్రాంతితోనే ఈ వేడుక మొదలవుతుంది.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో బరిలోకి దిగుతున్న మెగాస్టార్, తన మాస్ హవాను మరోసారి చూపించనున్నాడు. మార్చ్ నెలలో నాని ‘ప్యారడైస్’, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలు వస్తుండగా, వేసవి స్పెషల్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ చిత్రంతో బాక్సాఫీస్ హిట్ ముద్ర వేయనున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించకముందే నార్త్ సౌత్ అంతటా రెస్పాన్స్ రావడం విశేషం.
ఇక హాఫ్ ఇయర్ అయిపోగానే ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ తో మళ్లీ సీన్‌లోకి వస్తాడు. అలాగే ‘ఫౌజీ’ అనే ఇంకొక సినిమాతో ఫుల్ యాక్షన్ మూడ్ ను కొనసాగించనున్నాడు. డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌తో వచ్చే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కూడా ఇండియన్ స్క్రీన్‌పై ఓ భిన్న ప్రయోగంగా నిలవనుంది. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో టెక్నికల్ వాల్యూస్ ఉండనున్నాయని సమాచారం.
ఈ ప్రాజెక్టుల దూకుడుతో 2026లో టాలీవుడ్ మార్కెట్ రూ.5000 కోట్లకు పైగా ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కంటెంట్, స్టార్ పవర్, టెక్నికల్ గ్రాండియర్.. ఈ మూడింటి సమ్మేళనంతో 2026 తెలుగుసినిమాకు ఒక చారిత్రక సంవత్సరం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
