అయ్యోపాపం.. ఉస్తాద్ భగత్ సింగ్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరు.! వ్యక్తి ఒకరే.. కానీ, రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అదే అసలు సమస్య. అబ్బే, అది బలహీనత కాదు.. అదే బలం.. అని కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు.

కానీ, పవన్ కళ్యాణ్ తీరు ఇంకోలా వుంది. తాను నటిస్తున్న సినిమా పేరుని పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ‘సర్దార్ భగత్ సింగ్’ అంటూ కొత్త పేరు పెట్టారు. ఇదేదో బావుందే.. అంటూ అభిమానులైతే మురిసిపోతున్నారు.

కానీ, అసలు సినిమా టైటిల్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అని పేరు పెట్టారు. కానీ, తొలుత అనుకున్న కథ మారిపోయింది. టైటిలూ మారిపోయింది.

ఇప్పుడేమో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని కాస్తా పవన్ కళ్యాణ్ ‘సర్దార్ భగత్ సింగ్’ అనేశారు. అభిమానులేమో, టైటిల్ మార్చేద్దామంటున్నారు. మార్చేస్తే పోలా.? ఏమో, మార్చేస్తారేమో కూడా.! అయ్యోపాపం ‘భవదీయుడు భగత్ సింగ్’.!