బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినిమా విజయం లాజిక్‌పై ఆధారపడదు, ప్రేక్షకుల నమ్మకమే కీలకం” అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మ దర్శకత్వం వహించిన RRR, యానిమల్, గదర్ వంటి సినిమాలు ఈ విషయానికి మంచి ఉదాహరణలని పేర్కొన్నారు.
కరణ్ తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “కొన్ని సినిమాలు కథలో లాజిక్ కన్నా ప్రేక్షకుల నమ్మకంతో హిట్ అవుతాయి. రాజమౌళి తీసే సినిమాలే అందుకు ఉదాహరణ. ఆయన సినిమాల్లో ఎలాంటి సన్నివేశమైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా ప్రెజెంట్ చేయగలరు. అదే ఆయన విజయ రహస్యం” అని ప్రశంసించారు.
“ఓ గొప్ప దర్శకుడు తన కథను ఎంత నమ్మితే, ప్రేక్షకులందరూ అదే విధంగా నమ్మేలా ఉంటారు. RRR, యానిమల్, గదర్ సినిమాలు విజయం సాధించడం వెనుక కూడా అదే నమ్మకమే కారణం. సినిమాను పూర్తిగా వినోదంగా ఆస్వాదించాలి, లాజిక్ గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు” అని కరణ్ స్పష్టం చేశారు.
సినిమా అనేది మాయా లోకం, దాన్ని రియాలిటీగా చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడంలో ఆయనే క్రియేట్ చేసే నమ్మకమే ప్రధానమని కరణ్ అభిప్రాయపడ్డారు.