RRR Movie: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఆర్‌ఆర్ఆర్‌ చిత్ర బృందం

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఎట్టకేలకు రిలీజైంది. సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాదు, వివిధ దేశాల్లోని ఫ్యాన్స్ సైతం ఆతృతగా వెయిట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. రిలీజ్ కానుందన్న సందర్భంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చారు.

ఇకపోతే తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంతో మంది సెలబ్రెటీలు మొక్కలు నాటి ప్రకృతిపై తమకున్న ఇష్టాన్ని తెలుపుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్‌ఆర్ఆర్‌ రిలీజ్ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్న. రాష్ట్రం, దేశం పచ్చగా ఉండాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని ఆయన తెలిపారు.`బాహుబలి` టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా, ఎదేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని ఆయన కోరారు. అంతే కాకుండా ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అన్న ఆయన, మన ఇంట్లో పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలని తారక్ చెప్పారు.

ఇదిలా ఉండగా గతంలో తాను కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నానన్న రామ్ చరణ్, మొక్కలు నాటిన ప్రతీసారీ ఏదో తెలియని ఉత్సాహం వస్తుందని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని ఆయన తెలిపారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ ను `ట్రిపుల్ ఆర్` టీమ్ అభినందించింది. ఇక సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌ అంటూ ఎప్పుడూ బిజీగా గడిపే ఈ స్టార్ హీరోస్‌ పాటు, రాజమౌళి గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యావాదాలు అంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ కొనియాడారు.