అవసరాల దర్శకత్వంలో ఆ హీరో..

అష్టాచెమ్మా సినిమాతో నేచురల్ స్టార్ నాని, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా టాలీవుడ్ కి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక నాని అయితే సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కి దగ్గరగా వచ్చేశాడు. దసరా మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అతని ఇమేజ్ అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంది.

మరో వైపు అవసరాల శ్రీనివాస్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో దర్శకుడిగా కూడా తన మార్క్ సినిమాలు చేసుకుంటూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడు. అతని దర్శకత్వంలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వస్తే ఆ మూడు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక నటుడిగా కూడా తనదైన మేనరిజమ్, మార్క్ కామెడీతో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆయన చివరిగా నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమాతో హీరోగా వచ్చాడు. ఇక ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాతో దర్శకుడిగా మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిఅమ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. నాగ శౌర్య ఈ మూవీలో హీరోగా నటించాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కి దగ్గర పడుతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవసరాల శ్రీనివాస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేచురల్ స్టార్ నానితో సినిమాపై స్పందించాడు. నానిని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉందని చెప్పాడు. అయితే మా ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే కచ్చితంగా ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉంటాయని తెలిపారు.

ఈ నేపధ్యంలో వారి అంచనాలు అందుకునే విధంగా కథ సిద్ధం అయినపుడు కచ్చితంగా ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాడు. మా ఇద్దరి కాంబోలో సినిమా రావడం మాత్రం పక్కా అని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే అవసరాల శ్రీనివాస్ నటుడిగా ఇప్పుడు గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఈషారెబ్బ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.