సినిమా పరిశ్రమ, రాజకీయం.. ఈ రెండూ ఒక్కటి కాకపోయినా పక్కపక్కనే ఉంటాయి. సినిమా పరిశ్రమ నుంచి రాజకీయానికి మద్దతు తెలిపేవారు ఉంటారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేవారూ ఉంటారు. అంతేకాకుండా, సినిమా పరిశ్రమలోనూ రకరకాల రాజకీయ పార్టీలకు చెందినవారూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనతో సన్నిహితంగా మెలిగిన ప్రముఖులు చాలా మందే ఉన్నారు.
అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తే దానిపై సినిమా పరిశ్రమ నుంచి పెద్దగా ఎవ్వరూ స్పందించడంలేదని విమర్శలు వస్తున్నాయి. అసలు వాళ్లు ఎందుకు స్పందించడంలేదు అనేది చాలా మంది ప్రశ్న. ఇదే ప్రశ్నను నిన్న మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విలేకరులు లేవనెత్తారు.
చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. వైఎస్సార్‌సీపీ నాయకుల ఎదురుదాడిని తట్టుకోలేకే సినీ పరిశ్రమకు చెందినవారు నోరుమెదపడం లేదని అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ లాంటి ఎంతో ప్రజాదరణ కలిగిన గొప్ప నటుడినే నోటికొచ్చినట్టు తిట్టారని.. ఆయనే తట్టుకోలేనప్పుడు మిగిలిన చిన్నచిన్న నటులు వైసీపీ దాడిని ఎలా తట్టుకోగలని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమలో కూడా రెండు వర్గాలు ఉంటాయని.. ఎన్టీఆర్ సమయం నుంచే రెండు పార్టీలకు చెందిన మనసులు ఇండస్ట్రీలో ఉండేవారని గుర్తుచేశారు. ‘సినిమా ఇండస్ట్రీ చాలా దుర్బలమైనది. 2009లో మేం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సినిమా ఇండస్ట్రీలో వేర్వేరు రాజకీయ వర్గాలు ఉన్నాయి.
కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారులు. తెలుగుదేశంకి సంబంధించిన మద్దతురాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందినవాళ్లు ఉన్నారు. వారంతా ఇప్పుడు వైసీపీ మద్దతుదారులుగా మారిపోయి ఉండొచ్చు. అలాగే నాకు కొద్దిగా మద్దతు ఏమైనా ఉంటుందోమో నాకు తెలీదు. మనస్పూర్తిగా చెప్పాలంటే నేనే అంతగా ఆలోచించను’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
చిత్ర పరిశ్రమలో ఉన్న 24 శాఖలకు చెందినవాళ్లు రాజకీయంగా తమ మద్దతు తెలియజేసినా నేరుగా రాజకీయాలపై మాట్లాడలేరని.. పొలిటికల్ హీట్‌ను వాళ్లు తీసుకోలేరని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తమను టార్గెట్ చేస్తారనే భయం వాళ్లలో ఉంటుందని.. వాళ్ల బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. వాళ్లకు కూడా బాధ ఉంటుందని.. అది బయటికి తెలియట్లేదంతేనని వెల్లడిరచారు.
వైసీపీ టార్గెట్ చేయడం వల్లే వాళ్లు బయటికి రాలేకపోతున్నారని ఆరోపించారు.‘ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విూద తీయని సినిమా లేదు. మండలాదీశుడు దగ్గర నుంచి తీస్తూనే వచ్చారు. కోట శ్రీనివాసరావుతో తీశారు. ఆఖరికి మన పృథ్వీతో కూడా తీశారు. ఇన్ని తీసినా ఎక్కడా కక్ష సాధింపు చర్యలు జరగలేదు.
ఎన్టీ రామారావు హయాంలో కానీ.. ఆ తరవాత కానీ ఎప్పుడూ జరగలేదు. సినిమా పరిశ్రమలో విూ రాజకీయ అభిప్రాయం విూది తీసుకోండి అని ఆ తరవాత కలిసి కూడా నటించిన దాఖలాలు ఉన్నాయి. కానీ వీళ్లు కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు’ అని వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి రజనీకాంత్‌కు ఉదాహరణగా చెప్పారు. ‘రజనీకాంత్ ఒక సీనియర్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అశేష ప్రజాభిమానం గల వ్యక్తి, ఆయనకున్న పరిచయంతో చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనేదో మెచ్చుకుంటే ఆయన్ని తిట్టని తిట్టులేదు.
ఆయనే డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మామూలుగా కొత్తగా వచ్చిన హీరోల దగ్గర నుంచి హీరోలుగా ఎదుగుతున్నవారు వైసీపీ నోళ్లలో పడాలని అనుకోరు. నాలాంటి మొండోడు బయటికి రావాలి తప్ప.. వాళ్లు రారు. నేను పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ సామర్థ్యం ఉంది. నేను కూడా సినిమాల్లో మాత్రమే ఉంటే ఎంత వరకు మాట్లాడగలనో నాకు కూడా తెలీదు. కాబట్టి ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీకి మినహాయింపు ఇవ్వాలి’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.