అదరగొట్టనున్న ‘దేవర’ యాక్షన్‌ సన్నివేశాలు!

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ ‘దేవర’. జనతా గారేజ్‌ తర్వాత కొరటాల శివ `జూనియర్‌ ఎన్టీఆర్‌ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ‘దేవర’లో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తున్నాడు.

హైదరాబాద్‌ సమీపంలో వేసిన స్పెషల్‌ సెట్‌లో తారక్‌పై వచ్చే సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా సినిమా ఆలస్యం కాకుండా.. క్లైమాక్స్‌ పోర్షన్‌ను కొరటాల టీం ముందుగానే షూట్‌ చేస్తుందని నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్టీఆర్‌పై వచ్చే అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ను ఈ సెట్‌లో చిత్రీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ‘దేవర’కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను అందించి.. మూవీ లవర్స్‌లో జోష్‌ నింపుతున్నాడు. రాత్రి సమయంలో సముద్రంలో వచ్చే భారీ యాక్షన్‌ సీన్ల షూటింగ్‌ చేసినట్టు.. లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్‌ చేశాడు రత్నవేలు . ఈ అప్‌డేట్‌తో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ‘దేవర’లో చాలా కీలకంగా సాగే ఈ సీక్వెన్స్‌ కోసం తారక్‌ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట.

ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్‌ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ‘దేవర’లో పాపులర్‌ మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్‌ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.