తేజు బయటకొచ్చాడు.. కానీ, ఇన్నాళ్ళెందుకు పట్టింది.?

‘చిన్న గాయాలే అయ్యాయి.. కొద్ది రోజుల్లోనే కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాడు..’ అంటూ హీరో సాయి దరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయిన వెంటనే మెగా కాంపౌండ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ, తేజు కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టేసింది.

ఎట్టకేలకు, తేజు పూర్తిగా కోలుకున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీ గేదరింగ్ ఫొటో ద్వారా వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు తేజు ప్రమాదంపై ఇంత సస్పెన్స్ ఎందుకు నడిచింది.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

జరిగింది చిన్న ప్రమాదం కాదు. ‘పునర్జన్మ’ అనే స్థాయిలో మెగా కాంపౌండ్ భావిస్తోంది. తేజు అభిప్రాయం కూడా ఇదే. అదృష్టవశాత్తూ చిన్నపాటి గాయాలతోనే తేజు బయటపడ్డాడు. అయినాగానీ, సర్జరీ(లు) తప్పలేదు. వాటి నుంచి కోలుకోవడానికి సమం పట్టిందని అనుకోవాలేమో.

శారీరక గాయాల కంటే, మానసికంగా కొంత డిస్టర్బ్ అవుతుంటారు రోడ్డు ప్రమాదానికి గురైనవాళ్ళు. ఆ భయం నుంచి కోలుకోవడానికే ఇంత సమయం పట్టి వుండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.