చిన్నపిల్లల కథ.. టీన్జ్‌ 12న విడుదల

దర్శకనటుడు ఆర్‌.పార్తిబన్‌ దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన ’టీన్జ్‌’ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, అదే రోజున విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన ‘ఇండియన్‌`2’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి.

2022లో పార్తిబన్‌ నటించి దర్శకత్వం వహించిన నాన్‌లీనియర్‌ సింగిల్‌ షాట్‌ మూవీ ’ఇరవిన్‌ నిళల్‌’ విడుదలై విజయం సాధించింది. ఈ సినిమాలో పాటల్లో నేపథ్య గాయని శ్రేయా ఘోషల్‌ ఆలపించిన ’మాయావి’ పాటకు జాతీయ అవార్డు సైతం దక్కింది. ఇప్పుడు మరో వైవిధ్యభరితమైన కథతో అందరూ చిన్నపిల్లలే నటించిన ’టీన్జ్‌’ మూవీ తెరకెక్కించారు.

చైల్డ్‌ సెంట్రిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం అందించారు. కావ్‌మిక్‌ ఆరి సినిమాటోగ్రఫీ అందించగా, బయోస్కోప్‌ డ్రీమ్స్‌, ఆకీరా ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.