Puri Jagannadh: పూరి జగన్నాథ్.. ఈసారి కంటెంట్ గట్టిగానే..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్‌ ఇప్పుడు టర్నింగ్ పాయింట్ దశలో ఉంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి డిజాస్టర్‌ల తర్వాత మళ్లీ తన మార్క్ చూపించేందుకు ఆయన కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఈసారి ఆయన సాధారణ కథతో కాకుండా, డిఫరెంట్ యాంగిల్‌తో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్‌పై పని చేస్తున్నాడు. అందుకే, స్టార్‌ క్యాస్టింగ్‌తో నెక్ట్స్ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు.

పూరి తాజా సినిమా హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంపిక కావడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే విజయ్ సేతుపతి కథ బలంగా లేకపోతే ఎప్పుడూ ఓకే చెప్పడు. ముఖ్యంగా రెమ్యునరేషన్‌ కంటే కంటెంట్‌ ప్రధానమనే గుర్తింపు ఉన్న ఈ విలక్షణ నటుడు పూరి స్క్రిప్ట్‌కి ఓకే చెప్పడం ఆసక్తికరం. ఇందులో ఆయన పాత్ర కూడా చాలాదాకా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో టబు కీలక నెగటివ్ రోల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. టబు అంటే కథకు గొప్ప విలువ ఇచ్చే నటి. ఏడాదిలో ఓ రెండు మంచి పాత్రలకే ఓకే చెబుతుంది. అలాంటి ఆమె పూరి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కథలో ఉండే డైనమిజాన్ని సూచిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

చార్మి నిర్మాతగా, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్‌లో షూటింగ్ ప్రారంభించనుంది. విజయ్ సేతుపతి, టబులాంటి టాలెంటెడ్ నటుల సరసన పూరి సత్తా ఏ మేరకు నెరవేర్చగలడో ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్క్రిప్ట్ బలంగా ఉంటేనే ఇలా స్టార్లు ముందుకు వస్తారని పరిశ్రమలో చర్చ. మరి ఈసారి పూరి మ్యాజిక్‌ రిపీట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.