సూర్య చిత్రం సూప‌ర్ హిట్.. ఆలోచ‌న‌లో ప‌డ్డ మిగ‌తా హీరోలు

నేను ట్రెండ్ ఫాలో కాను, సెట్ చేస్తాను అనే సినిమా డైలాగ్ అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే డైలాగ్ తమిళ స్టార్ హీరో సూర్య‌కు వ‌ర్తిస్తుంది. కరోనా వ‌ల‌న థియేట‌ర్స్ అన్నీ దాదాపు 8 నెల‌లుగా మూత‌ప‌డి ఉండ‌డంతో చేసేదేం లేక తాను నిర్మించిన చిత్రాల‌నే కాక న‌టించిన చిత్రాలు కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నాడు. త‌న భార్య జ్యోతిక న‌టించిన తాజా చిత్రం ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గానే వివాదాలు, బెదిరింపులు వ‌చ్చాయి. అవేమి ప‌ట్టించుకోని సూర్య త‌ను న‌టించిన తాజా చిత్రం ఆకాశం నీ హ‌ద్దురా అనే సినిమను అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేశాడు.

ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉన్న‌ప్ప‌టికీ, చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌డం గొప్ప ప‌రిణామం అంటున్నారు. దివాళీ కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులే కాదు వెంక‌టేష్‌, మాధ‌వ‌న్ వంటి ప్ర‌ముఖులు కూడా సినిమాని ఆకాశానికి ఎత్తుతున్నారు. కొంద‌రైతే ఈ సినిమాని ప‌దే ప‌దే చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత ఇంత మంచి సినిమా రావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్‌గా థ్రిల్ అవుతున్నారు.

నాని-సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన వి సినిమా ఓటీటీలో విడుద‌ల కాగా, ఈ సినిమా త‌ర్వాత ఓటీటీలో విడుద‌లైన మ‌రో పెద్ద చిత్రం ఆకాశం నీ హ‌ద్దురా. ఓటీటీలోను ఈ చిత్రం దుమ్ము రేపుతుండ‌గా ఇటు చిత్ర నిర్మాత‌ల‌కు, అటు ఓటీటీ నిర్వాహ‌కుల‌కు లాభాలు భారీగానే వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. సూర్య మూవీ ఇచ్చిన ఫ‌లితంతో కొంద‌రు హీరోలు త‌మ సినిమాల‌ని కూడా ఓటీటీలో విడుద‌ల చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. సూర్య మాదిరిగా మిగ‌తా హీరోలు ఓటీటీ బాట ప‌డితే థియేట‌ర్స్ ప‌రిస్థితి ఏంటీ, యాజ‌మాన్యం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.