అయ్యో… ‘సుందరం మాస్టారు’

ఏ సినిమాకయినా కథలో బలం ఉండాలి. కథనంలో పట్టు ఉండాలి. అప్పుడు చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్‌’ అనే సినిమాతో కళ్యాణ్‌ సంతోష్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. హాస్య నటుడిగా పలు చిత్రాలలో నటించిన హర్ష చెముడు ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు, దివ్య శ్రీపాద కథానాయకురాలు. సుందరం (హర్షవర్ధన్‌) ఒక ప్రభుత్వ కళాశాలలో సోషల్‌ టీచర్‌ గా పనిచేస్తూ ఉంటాడు.

అతనికి కట్నం మీద ఆశ ఎక్కువ, అందుకని ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా అని పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్‌)కి మిరియాలమెట్ట గ్రామం నుండి తమ వూరికి ఒక ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడిని పంపించమని లేఖ వస్తుంది. మిరియాల మెట్ట అనే గ్రామ ప్రజలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు, ఆ గ్రామంలోకి బయట వాళ్ళకి కూడా ప్రవేశం లేదు. కానీ ఆ గ్రామంలో ఒక విలువైన వస్తువు ఎదో ఉందని, ఆ వస్తువుని కనిపెట్టి ఆ గ్రామాన్ని తన నియోజకవర్గంలో కలిపేయాలని ఎమ్మెల్యే సుందరాన్ని కోరతాడు.

దానితో తనకి పేరొస్తుందని, సుందరాన్ని డిఈఓ గా ప్రమోషన్‌ కూడా ఇస్తానని ఎమ్మెల్యే మాట ఇస్తాడు. ప్రొమోషన్‌ వస్తే కట్నంగా ఇంకా ఎక్కువ డబ్బు రాబట్టవచ్చు అని సుందరం కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. సుందరం ఇంగ్లీష్‌ టీచర్‌ గా మిరియాల మెట్ట గ్రామంలో అడుగుపెడతాడు. కానీ అతనికి ఆశ్చర్యంగొలిపే విషయం ఏంటంటే, అక్కడ ఆ గ్రామస్థులు అందరూ సుందరం మాస్టర్‌ కన్నా చక్కగా ఇంగ్లీష్‌ మాట్లాడుతూ వుంటారు. సుందరంకి ఇంగ్లీష్‌ సరిగ్గా రాదనీ అతనికే ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఫెయిలైతే ఉరితీత అని చెప్తారు.

మరి ఆ పరీక్షలో సుందరం సఫలం అయ్యాడా, విఫలం అయ్యాడా, ఇంతకీ ఆ వూర్లో వున్న విలువైన వస్తువు ఏంటి? అది సుందరం కనిపెట్టాడా? అతనికి ప్రమోషన్‌ వచ్చిందా? ఇంతకీ అతని పెళ్లి సంగతి ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే \సుందరం మాస్టర్‌’ సినిమా చూడాల్సిందే. హర్ష చెముడు కథానాయకుడిగా సినిమా అనగానే వినోదాత్మకంగా ఉంటుందని అనుకొనన్న వారికి తీవ్ర నిరాశ తప్పదు. వినోదాత్మకంగా కానీ, ఇటు ఏదైనా కథాబలం వున్న సినిమాగా కానీ తెరకెక్కించలేదు. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో కూడా అది చెప్పలేకపోయాడు. కథ సరిగా లేకుండా కేవలం రెండు గంటలకి పైగా ఎదో అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు పెట్టి సినిమా నడిపిద్దాం అన్న రీతిలో సినిమా సాగింది.

నటీనటుల విషయానికి వస్తే హర్ష చెముడు తన పాత్రకి తగిన న్యాయం చేసాడు. అక్కడక్కడా హాస్యం పండించాడు. దివ్య శ్రీపాద కథానాయకురాలిగా బాగుంది, కానీ ఆమెకి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారు. హర్షవర్ధన్‌ ఎమ్మెల్యేగా, అతని పీఏ గా భద్రం పరవాలేదనిపించారు. ఇక మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ఛాయాగ్రహణం పరవాలేదు, సంగీతం బాగుంది. మాటలు ఆలోచనాపరంగా వున్నాయి, కొంచెం వేదాంత ధోరణిలో కూడా వున్నాయి. రవితేజ లాంటి సీనియర్‌ నటుడు ఈ సినిమా ఎలా నమ్మి నిర్మాతగా ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి!?