ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్‌లో కీలకంగా మారిన ఓయో సంస్థ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వయసు, గుర్తింపు పత్రాలు ఉంటే రూమ్ బుక్ చేసుకోవడం సాధారణంగా ఉండేది. అయితే, ఇటీవల ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం పెళ్లి కాని జంటలకు ఓయోలో రూమ్ ఇవ్వడం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ మొదటిగా మీరట్‌లో అమలు చేయనున్నట్లు, తరువాత ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ ప్రకటించిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. “మేము హోటల్ పరిశ్రమను సురక్షితంగా మార్చడమే మా లక్ష్యం” అని ఆయన అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం రూమ్ బుకింగ్ సమయంలో వివాహ ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. పలు సంఘటనలు, వివాదాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం, హోటల్ వాతావరణాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చడంలో ముందడుగు అని సంస్థ అభిప్రాయపడుతోంది.
ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు ఈ చర్యను అభినందిస్తున్నప్పటికీ, మరికొంతమంది వ్యక్తిగత హక్కులను కుదింపు చేసే చర్యగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘ఇది హోటల్ పరిశ్రమలో పెద్ద మార్పుకి నాంది’’ అని కొందరు అంటున్నారు. మరోవైపు, తక్కువ ఖర్చులో హోటల్ సేవలను ఆశించే ప్రేమజంటలకు ఇది షాకింగ్ న్యూస్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తమ నిర్ణయంపై సంస్థ పూర్తి స్థాయిలో నిలబడి ఉంది. ‘‘ఇది ఒక్కడి నిర్ణయం కాదు, మా కస్టమర్ల సురక్షితమైన అనుభవాన్ని అధిక శ్రద్ధతో కాపాడటమే మా ప్రధాన ఉద్దేశ్యం’’ అని ఓయో ప్రతినిధులు తెలిపారు. ఈ మార్పు వల్ల కంపెనీ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.