కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం అభిమానుల ను ఆకట్టుకున్నది.
ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ప్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తునట్లు నెట్‌ప్లిక్స్ ప్రకటించింది. ఈ సినిమా రాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడని.. ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఒక డైలాగ్ ఉంటుంది.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మూవీలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ’అన్నపూరణి’ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడు అనడం.. శ్రీరాముడిని కించపరిచేలా ఉందని.. అలాగే హీరో ముస్లిం అయ్యి ఉండడం, హీరోయిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండడంతో లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని.. ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అలాగే ఈ సినిమాను స్టీమ్రింగ్ చేస్తున్న నెట్ ప్లిక్స్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై వివాదం ఎక్కువ అవ్వడంతో నెట్‌ప్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సినిమా విషయంలో నయనతారపై కూడా కేసు నమోదు అయ్యింది.