ఆ దర్శకుడితో శర్వా సైలెంట్ వర్క్..

టాలీవుడ్లో ట్రాక్ రికార్డు చూడకుండా దర్శకులతో సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఎంతో మంది ఫ్లాప్ దర్శకులకు, డెబ్యూ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చాడు. గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాతో యావరేజ్ హిట్ కొట్టిన శర్వానంద్ అంతకు ముందు వరకు ఉన్న ఐదు సినిమాల డిజాస్టర్స్కు ఫుల్ స్టాప్ పెట్టాడు. దీని తర్వాత దర్శకుడు కృష్ణచైతన్యతో మూవీ చేయనున్నట్లు ప్రకటించారు శర్వానంద్‌. అయితే ఆ చిత్రాన్ని ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచారని తెలిసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా కమిట్ అయినట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా అందిన సమాచారం.. శ్రీరామ్‌ ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమాను స్టార్ట్‌ చేసేశారట. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్లోనే సీక్రెట్గా షూటింగ్ జరుగుతోందట. ఇందులో హీరోయిన్గా కృతిశెట్టి నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే శర్వా-కృతి తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. అసలే సరైనా హిట్స్ లేక సతమతమవుతున్న వీరిద్దరికీ ఈ సినిమా ఎంతో కీలకమనే చెప్పాలి.

ఇక ఇంకో విషయం ఏంటంటే.. విభిన్న కథలు తెరకెక్కించే కేవీ గుహన్ తో కూడా శర్వానంద్ ఓ సినిమా చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శర్వానంద్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది వారాలుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఈ మధ్యనే అంగరంగ వైభవంగా జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రక్షిత మెడలో శర్వానంద్ త్వరలోనే మూడు ముళ్ళు వేయబోతున్నారు.