చైతన్య రావ్, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా ‘షరతులు వర్తిస్తాయి’ తాజాగా ఈ సినిమాకు సెన్సార్ ప్రశంసలు దక్కాయి. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రీలత-నాగార్జున సామల, శారదా – శ్రీష్ కుమార్ గుండా, విజయ -డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ నెల 15న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోంది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామికి సెన్సార్ సభ్యులు ప్రశంసలు అందజేశారు. ఈ చిత్ర దర్శకుడు కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుడు అనే విషయం తెలియకుండానే బోర్డ్ మెంబర్స్ సినిమాను చూశారు. తర్వాత తమ సభ్యుడే ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సినిమాపై సెన్సార్ బృందం స్పందిస్తూ.. తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా ‘షరతులు వర్తిస్తాయి’లో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా.. ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉందని పేర్కొన్నారు.
కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పన్నెండు గుంజలా పెళ్లి పందిరి’ అనే పాట ప్రస్తుతం తెలంగాణలోని అన్ని పెళ్లి వేడుకల్లోనూ వినిపిస్తోంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు దక్కడం సినిమా విజయం పట్ల మరింత నమ్మకాన్ని పెంచిందని ఈ సందర్భంగా నిర్మాత చెప్పుకొచ్చారు.