సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆమె ఆత్మహత్యకు ముగ్గురు వ్యక్తులే కారణమని పోలీసుల విచారణలో తెలిసింది. కేసు విచారణ సమయంలో రిమాండ్ రిపోర్టులో పోలీసులు కొన్ని మార్పులు చేశారు.
ఈకేసుకు సంబంధించి మొదటి నుంచి ఏ3గా ఉన్న దేవరాజ్ ను పోలీసులు ఏ1గా మార్చారు. ఏ1గా ఉన్న సాయికృష్ణారెడ్డిని ఏ2గా మార్చారు. ఏ2గా ఉన్న అశోక్ రెడ్డిని ఏ3గా మార్చారు.
శ్రావణి ఆత్మహత్యకు ఈ ముగ్గురి వేధింపులే కారణం అని పోలీసుల విచారణలో స్పష్టమయింది. వీళ్లతో పాటుగా మరో 17 మంది సాక్షులను కూడా పోలీసులు విచారించారు.
శ్రావణికి సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, దేవరాజ్ అనే ముగ్గురు వ్యక్తులతో పరిచయం ఉన్నప్పటికీ.. దేవరాజ్ ను మాత్రమే శ్రావణి ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకున్నది. కాకపోతే.. దేవరాజ్ కు శ్రావణిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. శ్రావణి… సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి అనే వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉండటం దేవరాజ్ కు నచ్చలేదు. అలాగే దేవరాజ్ తో శ్రావణి సన్నిహితంగా ఉండటం.. సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డికి నచ్చలేదు.
అందుకే.. వీళ్ల ముగ్గురితో శ్రావణికి గొడవలు జరిగాయి. సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి పీడను వదిలించుకోవడం కోసం.. శ్రావణి.. దేవరాజ్ ను బతిమిలాడింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. లేదంటే హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా వెళ్లిపోదామని చెప్పింది. కానీ.. దేవరాజ్ అందుకు ఒప్పుకోలేదు.
దేవరాజ్ ను కలిసినప్పుడల్లా సాయి, అశోక్ ఆమెను బెదిరించేవారు. దేవరాజ్ ను చంపేస్తామని అనేవారు. శ్రావణి, దేవరాజ్ ఓ హోటల్ లో లంచ్ చేస్తుండగా చూసిన సాయి.. శ్రావణిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. దేవరాజ్ ను కలవొద్దంటూ బెదిరించాడు. ఈ ఘటన ఈనెల 7న జరిగింది.
నిజానికి దేవరాజ్.. శ్రావణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే శ్రావణి ఆత్మహత్య చేసుకుని ఉండకపోవచ్చు. దేవరాజ్ ఒప్పుకోకపోవడంతో.. శ్రావణి మానసికంగా కుంగిపోయింది. మరోవైపు సాయి, అశోక్ వేధింపులను తట్టుకోలేకపోయింది. మానసిక ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్య చేసుకుంది.. అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.