శేఖర్‌ కమ్ముల సినిమాలో నాగార్జున.. చంచల్‌గూడలో షూటింగ్‌ ప్రారంభం

అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ సినిమా సంక్రాంతికి విడుదలైంది. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని ఈ సినిమాకి దర్శకుడు, ఇది అతనికి మొదటి సినిమా. ఇందులో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో, ఈ చిత్ర దర్శకుడి విజయ్‌ బిన్నిని కొరియోగ్రాఫర్స్‌, డాన్సర్స్‌ సంఘం సన్మానం చేసింది. నాగార్జున ఈ సినిమా విజయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తన తదుపరి సినిమా షూటింగ్‌ కూడా మొదలెట్టేసానని చెపుతున్నారు.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడే మొదలైంది, నాగార్జున మీద కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ సినిమా కోసమని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదు చంచల్‌ గూడా జైలులో చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ రెండు రోజుల నుండి చంచల్‌ గూడా జైలులో అవుతోందని, ఇంకా ఒకటి రెండు రోజులు అక్కడే జరుగుతుందని కూడా తెలుస్తోంది.

ఈ సినిమాలో నాగార్జున ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, అది సినిమాలో చాలా హైలైట్‌ గా ఉంటుందని కూడా చెపుతున్నారు. నాగార్జున, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. శేఖర్‌ కమ్ముల ఇంతకు ముందు తీసిన ‘లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌’ అనే సినిమాలో నాగార్జున భార్య, అమల అక్కినేని నటించారు. అప్పుడే నాగార్జున తనతో ఎప్పుడు సినిమా చేస్తున్నావు అని శేఖర్‌ కమ్ముల ని సరదాగా అడిగారు. అది ఇప్పుడు ఇలా కార్యరూపం దాల్చింది. శేఖర్‌ కమ్ముల, ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమాకి ఏషియన్‌ సునీల్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మాతలు.