సీక్వెల్ చిత్రంగా సీతారామం… అసలు విషయం చెప్పిన దుల్కర్ సల్మాన్!

దుల్కర్ సల్మాన్ హీరోగా హనురాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో అనుభూతి పొందారని చెప్పాలి.తెలుగు తమిళ మలయాళ భాషలలో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేసే విడుదల చేశారు. ఇలా ఈ సినిమా హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా హిందీలో కూడా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఓ విలేఖరి దుల్కర్ సల్మాన్ ప్రశ్నిస్తూ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం గురించి ప్రశ్నించారు.ప్రేక్షకుల మదిని ఆకట్టుకున్న ఈ ప్రేమ కావ్యానికి సీక్వెల్ చిత్రం ఉండబోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలోను కలిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా హీరోకు ఇదే ప్రశ్న ఎదురవడంతో ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ…తాను నటుడు కాకముందు నుంచే ఒక విషయాన్ని గ్రహించానని ఏదైనా ఒక సినిమా క్లాసికల్ హిట్ అయిన తర్వాత ఆ సినిమాని టచ్ చేయకూడదని తాను భావిస్తానని తెలిపారు. మేము ఈ సినిమా కథను నమ్మి చేశాం అనుకున్న విధంగానే ఈ సినిమా క్లాసికల్ చిత్రంగా అందరి మదిలో నిలిచిపోయింది. ఇలాంటి ఈ క్లాసికల్ సినిమాకి కొనసాగింపు ఉండదని నేను అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమా సీక్వెల్ ఉండదని క్లారిటీ ఇచ్చేశారు.