తెలుగు సినీ ప్రపంచంలో సంక్రాంతి పండుగ అంటే బాక్సాఫీస్ దగ్గర జాతరే. ప్రతి సంవత్సరం పెద్ద హీరోలు ఈ సీజన్‌కి తమ సినిమాల కోసం ముందుగా కర్చీఫ్ వేసుకుంటారు. 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్, డాకు మహారాజ్ తో బాలకృష్ణ, సంక్రాంతికి వస్తున్నాం తో వెంకటేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి 2026 సంక్రాంతి రేసులో ఎవరున్నారు అంటే..
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాలుగు ప్రధాన సినిమాలు పోటీలోకి దిగే అవకాశముంది. మొదట కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. ప్రస్తుతం ఆయన జన నాయగన్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2025లో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు సంక్రాంతి 2026కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమా కూడా 2026 సంక్రాంతికి రానుందని టాక్. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అదే సమయంలో వెంకటేష్ చేస్తున్న నెక్స్ట్ సినిమా కూడా ఈ పండుగ బరిలోకి రావచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇక యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఈ పండుగ రేసు కోసం సన్నద్ధమవుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా ఇప్పటికే గ్లింప్స్ తో మంచి హైప్ అందుకుంది. సినిమా ఆలస్యమవుతున్నప్పటికీ, వచ్చే సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని టాక్.
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కూడా ఈ రేసులో వెనుకబడేలా లేరు. రీసెంట్‌గా అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, మరో కొత్త సినిమాతో సంక్రాంతి థియేటర్లలో సందడి చేయనున్నారట. మొత్తంగా విజయ్, చిరంజీవి లేదా వెంకటేష్, నవీన్ పోలిశెట్టి, శివ కార్తికేయన్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయన్న అంచనాలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.