Sankranthiki Vasthunnam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా కనిపించగా, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించారు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను అందించిన చిత్రంగా నిలిచింది.
సినిమా విడుదలైనప్పటి నుంచి థియేటర్ల వద్ద అభిమానుల క్యూ కనపడుతూనే ఉంది. సినిమా విజయవంతంగా హౌస్‌ఫుల్ షోలతో ముందుకు సాగుతుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వినిపించడం ఇప్పుడు సరికొత్త చర్చలకు దారితీస్తోంది. ముందుగా ఒప్పందం ప్రకారం, ఈ సినిమాను ఫిబ్రవరి మొదటివారంలోనే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో, సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా నడుస్తుండడంతో, ఓటీటీ విడుదల తేదీని మారుస్తే బాగుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు ఈ విషయంపై జీ5తో చర్చలు జరుపుతుండగా, ఓటీటీ సంస్థ మాత్రం ముందుగా కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి స్ట్రీమింగ్ తేదీని మార్చడం అసాధ్యమని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు, ఓటీటీ సంస్థ మధ్య ఈ చర్చలు కొనసాగుతుండగా, అభిమానులు మాత్రం ఈ సినిమాను థియేటర్‌లో మరికొంతకాలం ఆస్వాదించాలని ఆశిస్తున్నారు. మేకర్స్ ప్యాన్లు, ఓటీటీ షెడ్యూల్ మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు చివరకు ఏం ఫలితాన్ని ఇవ్వనున్నాయో వేచి చూడాలి.