హిట్-4 కోసం ఆ స్టార్ హీరో?

ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే సినిమాలకు కొనసాగింపు ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. దక్షిణాది సినిమాలు సైతం సిరీస్ లను కొనసాగిస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటి కోవలోనే వచ్చిన హిట్‌ ఫ్రాంచైజీలో వచ్చిన హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌ , హిట్‌: ది సెకండ్‌ కేస్‌ చిత్రాలు హిట్స్‌ గా నిలిచాయి. దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ సిరీస్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి.

ఇక హిట్‌ సిరీస్‌ థర్డ్‌ పార్ట్‌ హిట్‌: ది థర్డ్‌ కేసు చిత్రంలో నాని హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పోలీస్ ఆఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌ పాత్రలో నటిస్తారు నాని. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇది సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ సినిమా సిరీస్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. హిట్ 4 ను ఓ స్టార్ హీరోతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిట్ 3 పట్టాలెక్కకముందే… హిట్-4కు కథ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే హిట్ 4 లో నటించే హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా…. ఆయన ఎవరో కాదు… నందమూరి నట సింహం బాలకృష్ణ అని తెలుస్తోంది. మాస్‌ లో ఊర మాస్ అయిన బాలయ్య అఖండ, వీర సింహా రెడ్డి విజయాలతో మంచి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో తన 108వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తోంది.

బాలయ్య బర్త్ డే సందర్భంగా 10న అధికారికంగా సినిమా పేరు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే శైలేష్ కొలను సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల బాలయ్య బాబును కలిసిన శైలేష్ కథను కూడా చెప్పారట. బాలయ్యకు కథ నచ్చిందని తెలుస్తోంది.

అయితే కథ విన్న బాలయ్య ఈ సినిమాకు ఎస్ లేదా నో అని కానీ చెప్పలేదట. బాలయ్యకు కథ నచ్చితే.. బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10న ప్రకటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం శైలేష్ కొలను వెంకటేష్‌తో కలిసి సైంథవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.