‘దేవర’ నుంచి సైఫ్‌ లుక్‌ విడుదల!

ఎన్టీఆర్‌,దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌ లో వస్తున్న ’దేవర’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 16 సైఫ్‌ అలీ ఖాన్‌ పుట్టినరోజు సందర్భంగా ’దేవర’ సినిమా నుండి అతని లుక్‌ మొదటి సారిగా చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. సైఫ్‌ అలీ ఖాన్‌ పోస్టర్‌ చూస్తూనే చెప్పొచ్చు, ఇది ఒక పీరియాడిక్‌ డ్రామా అని, ఇందులో అతని పాత్ర ఎంత ఇంటెన్స్‌తో ఉంటుంది అనేది. సముద్రం మీద వుంది బతికే వారి నేపథ్యంలో సాగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగానే సైఫ్‌ అలీ ఖాన్‌ లుక్‌ వుంది అని తెలుస్తోంది.

హైదరాబాద్‌ లో వేసిన ప్రత్యేకమైన సముద్రం సెట్‌ లో చాలా భాగం షూటింగ్‌ జరుగుతోంది. అలాగే కొన్ని పోరాట సన్నివేశాలను కూడా చిత్రీకరించారని, తెలుగు సినిమాలో ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదని కూడా అంటున్నారు. బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ ఇందులో కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రెండు విభిన్న పాత్రల్లో కనపడతాడు అని, అందులో ప్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే పాత్ర సినిమాకి హైలైట్‌ అని అంటున్నారు.

ఈ సినిమా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే అతనితో చాలా పోరాట సన్నివేశాలు, ఇతర సన్నివేశాలు చిత్రీకరించారు. ఇది పాన్‌ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ’ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటించిన తరువాత ఎన్టీఆర్‌ గ్లోబల్‌ స్టార్‌ అవటం, ఆ తరువాత వచ్చే సినిమా ఇదే అవటం ఆసక్తికరం.