మెగాస్టార్ చిరంజీవితో సాయి పల్లవి.! ఈసారైనా వర్కవుట్ అయ్యేనా.?

‘రీమేక్ సినిమా కాబట్టి, చిరంజీవితో సినిమా చేసే చాన్స్ వచ్చినా వదిలేసుకున్నాను..’ అంటూ ‘భోళా శంకర్’ సినిమా విషయమై సాయి పల్లవి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సాయి పల్లవి జడ్జిమెంట్ ఈసారి కరెక్టే అయ్యింది. ‘భోళా శంకర్’ చాలా పెద్ద డిజాస్టర్ మరి.! సాయి పల్లవితో ఆన్ స్క్రీన్ డాన్స్ చేయాలని వుందంటూ చిరంజీవి ఓ వేదికపై, సాయి పల్లవి సమక్షంలోనే వ్యాఖ్యానించార్లెండి.. అది వేరే విషయం.

అసలు విషయానికొస్తే, ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కున్న సినిమా కోసం సాయి పల్లవి పేరుని ఖారారు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా.

రొటీన్‌కి భిన్నంగా సినిమా వుంటుందనే ప్రచారం తొలుత జరిగినా, అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ (గ్లామర్, పాటలు, డాన్సుల్లాంటివి) జొప్పిస్తున్నారట. అయితే, సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

సాయి పల్లవి అంటే డాన్స్.. చిరంజీవి సంగతి సరే సరి.! మరి, ఈ ఇద్దరి మధ్యా డాన్స్ నంబర్ వుంటుందా.? ఏమోగానీ, సాయి పల్లవితో చిరంజీవి.. అనే ప్రచారం చాలా గట్టిగానే గుప్పుమంటోంది. నిప్పు లేకుండా పొగ పుట్టదు కదా.?