అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో ‘తండేల్’ పేరుతో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో మాట్లాడుతున్నాడు నాగచైతన్య. ఓకే, బాగానే వుంది. చివర్లో సాయి పల్లవి ఎంట్రీ అదిరింది. ఆమె పాత్రకి డైలాగుల్లేవు గ్లింప్స్ వరకు.! వాస్తవానికి, ఈ సినిమా ప్రారంభించడానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు.
ఉత్తరాంధ్రలో నాగచైతన్య, చందూ మొండేటి తిరిగారు. అక్కడి యాస, భాషని అవగతం చేసుకున్నారు. అయితే, ఇదంతా ఓ యెత్తు. సాయి పల్లవి ఇంకో యెత్తు.! ఏదన్నా సినిమాకి సాయి పల్లవి కమిట్ అయ్యిందంటే, ఆ సినిమాలోని తన పాత్రలోకి ముందే ఒదిగిపోతుంది.
అలా, ‘తండేల్’ సినిమా కోసం సాయి పల్లవి మరింత గ్రౌండ్ వర్క్ చేసిందట. తనే ప్రత్యక్షంగా ఉత్తరాంధ్రలో తిరిగిందట.. అదీ ఎవరికీ తెలియకుండా. సినీ పరిశ్రమలో ఉత్తరాంధ్రకు చెందినవారి సాయంతో, అక్కడి భాషనీ, పద్ధతుల్నీ తెలుసుకుందట.
సాయి పల్లవి హార్డ్ వర్క్ మామూలుగా లేదనీ, నాగచైతన్యని తేలిగ్గానే ఆమె ఇంకోసారి డామినేట్ చేసేస్తుందనీ అంటున్నారు. ఈ ఇద్దరూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా సాయి పల్లవి అంటే తెలంగాణ స్లాంగ్‌కి కేరాఫ్ అడ్రస్.! ఇకపై ఉత్తరాంధ్ర యాసకి బ్రాండ్ అంబాసిడర్ కాబోతోందేమో!?