సాయిధరమ్‌ తేజ్‌ కొత్త అవతారం!

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ మరోసారి పేరు మార్చుకున్నాడు. తన తల్లి పేరును కలిపి సాయిదుర్గ తేజ్‌గా కొత్త పేరును ప్రకటించారు. అలాగే తన తల్లి విజయ దుర్గ పేరుతో నూతనంగా ప్రారంభించిన ప్రొడక్షన్‌ హౌస్‌కు లోగోను కూడా విడుదల చేశారు. ఈ మేరకు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు తేజ్‌.

‘నా మాతృమూర్తి విజయదుర్గగారికి చిన్న బహుమతిగా ఆమె పేరుతో కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాను. మా మావయ్యలు చిరంజీవిగారు, నాగబాబు, అలాగే నా గురువు పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశీస్సులతో పాటు నా కెరీర్‌ బిగినింగ్‌లో ఎంతో సహకరించిన నా నిర్మాత దిల్‌రాజుగారి సపోర్ట్‌తో నా జీవితంలో ఇదో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభం. నా మిత్రులు నవీన్‌ విజయ్‌కృష్ణ, హర్షిత్‌ శ్రీలతో కలిసి చేసిన ‘సత్య’ షార్ట్‌ ఫిల్మ్‌తో అసోసియేట్‌ కావడం ఆనందంగా ఉందని ఇన్ట్సాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇక పేరు మార్పుపై మాట్లాడుతూ… తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్నట్లుందనే ఉద్దేశంతో అలా చేసినట్లు పేర్కొన్నారు.

నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, దానికి విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ పేరు పెట్టానన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘సత్య’ ప్రెస్‌ విూట్‌ వేదికగా ఆ సంగతి చెప్పారు. తన కొత్త సినిమా ‘గాంజా శంకర్‌’ ఆగిపోయిందనే విషయంపై విలేకరి స్పందన కోరగా.. ఓ వెబ్‌సైట్‌లో ఆ సినిమా నిలిచిపోయిందనే ఆర్టికల్‌ చదివానని, ఆ తర్వాత అప్‌డేట్‌ గురించి తనకు తెలియదని సాయి తేజ్‌ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఆ సైట్‌ రాసిన వార్త వల్లే ఆ విషయం తనకు తెలిసిందన్నారు.

రామ్‌ చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ మావయ్యలతో కలిసి నటించా. తర్వాత చిరంజీవి మామయ్యతో కలిసి తెరను పంచుకోవాలనేది లక్ష్యం. ఆ డ్రీమ్‌ పూర్తయ్యాక మా ఫ్యామిలీలోని ఇతర హీరోలతో కలిసి నటిస్తా’ అని అన్నారు.

సాయి ధరమ్‌, కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రమే ‘సత్య’. నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మ్యూజికల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవల నిర్వహించిన టౌలౌజ్‌ షార్ట్స్‌ ఫెస్ట్‌ (ఫ్రాన్స్‌)లో ప్రదర్శితమై, ఎనిమిది అవార్డులు, ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో రెండు పురస్కారాలు కైవసం చేసుకుంది. ఇంతవరకు నటుడిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన ఆయన.. ఇప్పుడు చిత్ర నిర్మాతగానూ మారుతున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల తో పంచుకున్నారు. మామయ్యల ఆశీస్సులతో ఇది సాధ్యమైందంటూ పోస్ట్‌ పెట్టారు. కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌కు విజయదుర్గ ప్రొడక్షన్స్‌’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన మా అమ్మ పేరు విూద.. ఆవిడకు నేనిచ్చే బహుమతిగా నిర్మాణ సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.