మెగా హీరో నుంచి బన్నీకి మద్దతు.. విబేధాలు లేనట్లే?

పుష్ప 2: ది రూల్ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న తరుణంలో, మెగా ఫ్యామిలీ నుంచి ఆసక్తికర సపోర్ట్ వెలువడింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పుష్ప 2 టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బన్నీకి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ స్పందన రెండు వర్గాల మధ్య చర్చలకు తెరలేపింది.

సాయి తేజ్ తన ట్వీట్‌లో ‘‘అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అంటూ అభిమానులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్‌ని ‘‘బన్నీ’’ అని ప్రేమగా సంబోధిస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ సంఘటన తర్వాత మెగా అభిమానుల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది.

గతంలో మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ పెరిగిందని పుకార్లు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆ పరిణామాల అనంతరం మెగా హీరోలు పుష్ప 2 గురించి మౌనం పాటించడాన్ని ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపధ్యంలో సాయి తేజ్ పెట్టిన ట్వీట్ పరిస్థితిని మెరుగుపరిచేలా కనిపిస్తోంది.

సాయి తేజ్ స్పందన తర్వాత మెగా ఫ్యాన్స్, బన్నీ అభిమానులు మళ్లీ ఒకే వేదికపైకి రావడమేమోనని చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ‘‘మెగా ఫ్యామిలీ నుండి పుష్ప 2కి సపోర్ట్ వచ్చింది అంటే ఆ గొడవలు ముగిసినట్టేనా?’’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మెగా హీరోల మౌనం బ్రేక్ అయినందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.