సాఫీగా సాగుతున్న ప్రపంచంపై కరోనా కోరలు చాచడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కరోనా తగ్గిందని అనుకునే సమయంలో కొత్త కరోనా పుట్టుకు రావడంతో జనాలకు ఏం చేయాలో కూడా అర్ధం కావడం లేదు. ఈ కరోనా మహమ్మారి సామాన్యులనే కాక సెలబ్రిటీలని సైతం వణికిస్తుంది. తాజాగా మెగాస్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. నాకు ఎలాంటి లక్షణాలు లేవు, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. ఈ మధ్య నన్ను కలిసిన వారు కూడా ఓ సారి పరీక్షలు చేయించుకోండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తాను అని అన్నారు.
రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారని తెలుసుకున్న అభిమానులు, మెగా ఫ్యామిలీ, ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం గుండెల్లో అలజడి మొదలైంది. రామ్ చరణ్ ఎప్పుడు కోలుకుంటారా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే డిసెంబర్ 24న రాత్రి రామ్ చరణ్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి తన కుటుంబ సభ్యులు అందరిని ఆహ్వానించారు. అల్లు అర్జున్ నుండి మొన్న పెళ్లి చేసుకున్న చైతన్య వరకు ప్రతి ఒక్కరు పార్టీలో పాల్గొని చిల్ అయ్యారు. చరణ్‌తో కలిసి సన్నిహితంగా ఫొటోలు దిగారు. ఇది జరిగి నాలుగు రోజులే అవుతున్న క్రమంలో రామ్ చరణ్ నుండి కరోనా మెగా ఫ్యామిలీలో ఎవరికైన సోకి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ టీం బృందం కూడా చరణ్‌తో కలిసి కొద్ది రోజులుగా పనిచేస్తూ వస్తుంది.ఆయన నుండి ఎవరికైన కరోనా సోకిందా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటికే కరోనా వలన అన్నాత్తె సినిమా షూటింగ్ ఆగిపోగా, ఇప్పుడు రామ్ చరణ్ నుండి ఇతరులకి కరోనా సోకితే ఈ మూవీ చిత్ర షూటింగ్‌ను కూడా కొద్ది రోజుల పాటు వాయిదా వేయనున్నారు. ఇప్పటికే కరోనాతో 9 నెలలు పెండింగ్ పడ్డ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో ఆ జక్కన్నకే తెలియాలి.