పాన్ ఇండియా మూవీ నుండి ప‌వ‌ర్ ఫుల్ రోల్‌ను రివీల్ చేసిన చిత్ర బృందం

బాహుబ‌లి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటిస్తే కేజీఎఫ్ చిత్రం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ స్థాయిని మ‌రింత పెంచింది. పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్కిన కేజీఎఫ్ చిత్రం రూ. 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా మూవీని రూపొందిస్తున్నారు.

క‌రోనా వ‌ల‌న ఆగిన క‌న్న‌డ చిత్రం కేజీఎఫ్ 2 ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం చిత్రంలో అధీరా పాత్ర పోషిస్తున్న సంజ‌య్ ద‌త్‌తో పాటు కొన్ని ముఖ్య పాత్ర‌ల‌పై కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మూవీలో బాలీవుడ్ బ్యూటీ ర‌వీనా టాండ‌న్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ రోజు ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పాత్ర పేరు, ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశారు. రమికా సేన్‌ అనే పొలిటీషియన్‌ పాత్రలో ఎర్ర‌టి చీర ధరించి అసెంబ్లీలో మాట్లాడుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.

రవీనాటాండన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘క్రూరత్వానికి అధినేత్రి, పవర్‌ హౌస్‌ రమికా సేన్‌’కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ర‌వీనాకు సంబంధించిన లుక్‌ని విడుద‌ల చేశారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. చిత్రంలో బ్యూటీ క్వీన్ శ్రీనిధి శెట్టి ఫీమేల్ లీడ్‌లో న‌టిస్తుండ‌గా, రావు ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది.

గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో రాఖీ తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు?.. న‌రాచీకి కింగ్‌గా ఎలా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రెండ‌వ పార్ట్‌ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది విడుద‌ల అవుతుంది అనుకున్న కేజీఎఫ్ 2 చిత్రం క‌రోనా వ‌ల‌న వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డింది.