రచన- దర్శకత్వం : జేఎస్ఎస్ వర్ధన్
తారాగణం : అంకిత్ కొయ్య, నీలఖీ పాత్రా, నరేష్, వాసుకి తదితరులు
సంగీతం : విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం : డి. సాయి కుమార్
బ్యానర్ : మారుతీ ప్రోడక్ట్
నిర్మాత : ఏ. విజయపాల్ రెడ్డి
విడుదల: సెప్టెంబర్ 19, 2025
ఈ వారం థియేట్రికల్ రిలీజ్ గా వచ్చిన సినిమాల్లో యంగ్ గ్ హీరో అంకిత్ కొయ్య నటించిన ‘బ్యూటీ’ ప్రేక్షకులు- ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. దీని రివ్యూలో కెళ్ళి ఎలా వుందో చూద్దాం…
కథేమిటి?
వైజాగ్ లో నారాయణ (నరేష్) ఒక క్యాబ్ డ్రైవర్. అతడికో భార్య (వాస్సుకి), కాలేజీ కెళ్ళే కూతురు అలేఖ్య (నీలఖీ పాత్రా). కూతురంటే పంచ ప్రాణాలు. ఆమె ఏంకోరినా కాదనకుండా కష్టపడి సంపాదించి అందిస్తాడు. అలేఖ్య అర్జున్ (అంకిత్ కొయ్య) అనే యూత్ తో ప్రేమలో పడుతుంది. ఓ రాత్రి ఆమె అతడితో వీడియో కాల్ మాట్లాడుతూ తల్లి కంట పడుతుంది. దీంతో అర్జున్ తో కలిసి హైదరాబాద్ కి పారిపోతుంది. అక్కడ ఒక ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుంటుంది. ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్న కూతురు కనిపించకపోయే సరికి నారాయణ దిక్కు తోచని స్థితిలో పడతాడు. ఆమె కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. అది ఫలించి కూతురు దొరికిందా? దొరికేటప్పటికి ఎలాటి స్థితిలో వుంది కూతురు? ఇదీ మిగతా కథ.
ఎవరెలా చేశారు?
ఇది ప్రధానంగా నరేష్ తండ్రి పాత్ర కథ. కూతురితో తన అనుబంధాన్ని ప్రదర్శించే సన్నివేశాల్లో తన అనుభవాన్నంతా నూరి పోశాడు. చాలా ఎమోషనల్ పాత్ర, నటన. అయితే తన పాత్రకి కథ మాత్రం సహకరించలేదు. కథలో బలం లేకపోవడం వల్ల. కూతురు ఎలాటి కష్టంలో ఎక్కడున్నా ఆమెకి ఏకైక దిక్కుగా తండ్రి ఉంటాడన్న మెసేజ్ అయితే వుంది గానీ, పేలవమైన కథనం వల్ల అ మెసేజ్ పనిచేయదు. భార్యగా వాసుకీ ఓకే. కూతురి పాత్రలో నిలఖీ పాత్రా ప్రేమలో తెగించిన అమ్మాయిగా, తర్వాత పశ్చాత్తాప పడే కూతురిగా బాగానే నటించింది. రొమాంటిక్ సన్నివేశాలు కాస్త అతిగానే వుంటాయి. ఇక హీరో పాత్రలో అర్జున్ కొయ్య కి ఇది భిన్నమైన సీరియస్ పాత్ర . పాత్రచిత్రణలో లోపాలు మాత్రం చాలా వున్నాయి. సెకండాఫ్ లో యాక్షన్ కథగా మారే క్రమంలో ఈ లోపాలు చాలా బయట పడతాయి. ఈ సినిమాతో అతను ప్రేక్షకుల్ని తప్పక నిరాశ పరుస్తాడు.
సాంకేతికాలు?
ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం బలం. రెండు మెలోడియస్ సాంగ్స్, బ్యాక్ గ్రవుండ్ స్కోరు బలహీన కథనాన్ని ఎంతో కొంత నిలబెట్టడానికి ప్రయత్నిస్తాయి. సాయికుమార్ ఛాయాగ్రహణం ఫస్టాఫ్ రొమాంటిక్ ఫ్లేవర్ తో, సెకండాఫ్ డార్క్ షేడ్స్ కథకి తగ్గట్టు ప్లాన్ చేయడం బావుంది. మిగతా సాంకేతికాలన్నీ ఫర్వాలేదు. వైజాగ్, హైదరాబాద్ లోకేషన్స్ కొంతవరకు ఆకర్షిస్తాయి.
కథా కథనాలు?
యూత్ కి, వాళ్ళ పేరెంట్స్ కీ బలమైన మెసేజ్ కాదు, సీరియస్ మెసేజ్ ఇవ్వడానికే ప్రయత్నించిన కథ ఇది. పేరెంట్స్ అతి గారాబం, యూత్ గాలి వాటు తనం కుటుంబాలకి ఎంత కష్టం కలిగిస్తాయో చెప్పాలనుకున్నారు గానీ, చెప్పలేకపోయారు. ఈ జనరేషన్ కి చెప్పాలనుకున్న కథలో కనీసం ఫస్టాఫ్ లో ప్రేమ కథ ట్రెండీ గా చూపించలేకపోయాడు దర్శకుడు వర్ధన్. నేటి జనరేషన్ ఈ పాత మూస ప్రేమ సన్నివేశాలని జీర్ణించుకోవడం కష్టం. ఇంటర్వెల్ లో ఒక ట్విస్టు పెట్టుకుని, అదే ఫస్టాఫ్ ని నిలబెడుతుందని నమ్మి ఫస్టాఫ్ లో ఈ మూస ప్రేమని సాగదీస్తూ పోయాడు. ఇది బెడిసి కొట్టింది. స్క్రీన్ ప్లేకి ఒక స్ట్రక్చర్, క్రియేటివిటీ ఏవీ ఆవసరం లేదన్నట్టు సాగింది వ్యవహారం.
సెకండాఫ్ హైదరాబాద్ లో అమ్మాయిల్ని అపహరించే ముఠాతో ఈ ప్రేమ కథ కాస్తా యాక్షన్ కథగా మారిపోయింది. మారిపోవడమే గాక బోరు కొట్టే స్థితికి చేరింది. పేరెంట్స్ ని వదిలి ప్రియుడితో పారిపోయే అమ్మాయి కథతో ఏం గుణపాఠం నేర్చుకోవాలో ఆ సున్నితత్వం ఆధారంగా పేరెంట్స్ కీ, ప్రేమకీ మధ్య ఘర్షణ చూపించాల్సిన కథ క్రిమినల్స్ తో యాక్షన్ కథగా మారిపోవడంతోనే సినిమా విజయావకాశాలు ప్రశ్నార్ధకంగా మారాయి.
చివరికేమిటి
ముందు కథకి మార్కెట్ యాస్పెక్ట్ ఉందా, వుంటే క్రియేటివ్ యాస్పెక్ట్ అందుకుతగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ ఎలా ఉండాలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చేసుకోకపోతే ఫలితాలు ఇలాగే వుంటాయి. దర్శకుడు ఇకముందు ఈ రెండు విషయాల మీద పట్టు సాధిస్తే తప్ప ముందు ముందు సినిమాలు కష్టం. హీరోయిన్ ని బోల్డ్ గా చూపించే ద్రుశ్యాలున్నంత మాత్రాన యువ ప్రేక్షకులు సినిమా వెంటపడరు. ఆ బోల్డ్ నేస కి కూడా తగ్గ కథ వుండాలి. లేకపోతె బూతుగా మిగిలిపోతుంది.
రేటింగ్ : 2/5


