బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో రాముడిగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ విషయంపై ‘రామాయణ్’ సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ మాట్లాడారు.’రణ్‌బీర్ గొప్ప నటుడు. తన యాక్టింగ్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయి. చాలా కష్టపడి పనిచేస్తాడు. సంస్కారవంతుడు. నైతిక విలువలు కలిగిన వ్యక్తి. భారతీయ సంస్కృతిని గౌరవిస్తాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. రాముడిగా కూడా ఉత్తమంగా నటిస్తాడని నా అభిప్రాయం’ అని చెప్పారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా సినిమాపై అప్‌డేట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీని వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్ తివారీ టీమ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీతో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్ టెస్ట్ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని ప్రచారం సాగుతోంది.