రానా నాయుడు.. హద్దులు దాటడంపై వెంకీ కామెంట్

విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్ లో నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. కంప్లీట్ గా హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ డబ్బింగ్ వెర్షన్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ కంపీట్ బోల్డ్ గా ఉండటంతో పాటు వెంకటేష్, రానా పాత్రలతో బూతు డైలాగ్స్ చెప్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

విక్టరీ వెంకటేష్ అభిమానుల నుంచి. సెలబ్రిటీల వరకు చాలా మంది రానా నాయుడు వెబ్ సిరీస్ లో డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ వెంకటేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం చేసిందనే మాట కూడా వినిపించింది. అయితే రానా నాయుడుకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ కూడా రాలేదు. ఇందులో ఉన్న అభ్యంతర డైలాగ్స్ కారణంగా తెలుగు ఆడియన్స్ పెద్దగా ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఆసక్తి చూపించలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవాజుద్దీన్ సిద్దీఖ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా మెరుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ కి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రానా నాయుడు సీజన్ 2 విషయంలో కచ్చితంగా మొదటి పార్ట్ లో చేసిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం అని చెప్పుకొచ్చారు. అలాగే డైలాగ్స్ విషయంలో కూడా మరింత శ్రద్ధ తీసుకొని అందరికి చేరువ అయ్యే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చారు.

రానా నాయుడు వెబ్ సిరీస్ ని అమెరికిన్ సిరీస్ రేయ్ డోనోవన్ రీమేక్ గా తెరకెక్కించారు. ఇక ఒరిజినల్ వెబ్ సిరీస్ 7 సీజన్స్ గా రిలీజ్ అయ్యింది. రానా నాయుడుని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే మొదటి భాగంలో బూతు డైలాగ్స్ రీచ్ కాకపోవడంతో ఈ సారి స్క్రిప్ట్ కి సరిపోయే విధంగా బోల్డ్ టెంపో మిస్ కాకుండా సంభాషణలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.