నెట్‌ఫ్లిక్స్‌తో రామ్‌ వెబ్‌ సీరిస్‌!

కథానాయకుడు రామ్‌ త్వరలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పుడాయన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌.. రామ్‌తో ఓ వెబ్‌సిరీస్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలిసింది. ఈ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాక దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈలోపు రామ్‌ తన తదుపరి కొత్త సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఈ కొత్త కబురుని ఈనెల 15న తన పుట్టినరోజు సందర్భంగా వినిపించనున్నట్లు తెలిసింది.