రామ్ చరణ్ 16 – రెహమాన్ రేటు కూడా గట్టిగానే..

ఇండియన్ సినీ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్, రామ్ చరణ్ 16వ ప్రాజెక్ట్ (RC16) లో మ్యూజిక్ అందించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రెహమాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఇది తెలుగులో ఒక సంగీత దర్శకుడికి ఇప్పటివరకు ఇచ్చిన అత్యధిక రెమ్యునరేషన్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

మ్యూజిక్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రెహమాన్, ప్రతి ప్రాజెక్ట్ కోసం హై క్వాలిటీతో పని చేస్తారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేకతను తెచ్చే సామర్థ్యంతో ఉంటాయి. గ్లోబల్ లెవల్‌లో రెహమాన్ క్రేజ్ ఉండటం వల్ల ఆయన పాటలు పాన్-ఇండియా ప్రేక్షకులను మాత్రమే కాదు, విదేశీ మార్కెట్‌ను కూడా ఆకర్షించగలవు. దర్శకుడు బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్ కోసం రెహమాన్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా అదే.

రెహమాన్ తెలుగు సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే, RC16లో ఆయన మ్యూజిక్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆయన గతంలో చేసిన ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలు మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సారి బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా పవర్ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రానుంది, అలాగే సినిమా పాన్-ఇండియా రేంజ్‌లో ఉండటంతో సినిమాపై మరింత హైప్ తీసుకురానుంది. ఇక సినిమాను వచ్చే ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారు.