చరణ్‌తో వెయ్యి కోట్ల బొమ్మ.! రిస్కేమో.!

రిస్క్ చేయకపోతే లైఫ్‌లో రస్క్ కూడా దొరకదన్నది పాత మాటే.! కానీ, వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే, అది ఆషామాషీ వ్యవహారం కాదు. తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరిగిన మాట వాస్తవం. కానీ, ఓటీటీ యుగంలో.. సినిమాలు, వాటి వసూళ్ళు కొంత అయోమయంగానే కనిపిస్తున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిజానికి, ‘గట్టెక్కేసింది’ అనడం సబబు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు.. ఇవన్నీ పక్కన పెడితే, అంతకు మించి వసూళ్ళు సాధించాల్సిన రాజమౌళి సినిమా ఇది.

‘సలార్’ సినిమాకి ఏమయ్యింది.? చాలా చాలా పెద్ద సినిమాల పరిస్థితి ఏమవుతోంది.? ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, ‘దేవర’ అయినా, ‘గేమ్ ఛేంజర్’ అయినా, ఇంకో సినిమా అయినా.. ఈ రోజుల్లో మామూలు రిస్క్ కాదు.

అలాంటిది, రామ్ చరణ్ తదుపరి సినిమాల మార్కెట్‌ని వెయ్యి కోట్లంటూ లెక్కలేసేస్తున్నారు. చరణ్ విషయంలోనే కాదు, అల్లు అర్జున్ సహా ఆ రేంజ్ హీరోలందరి విషయంలోనూ ఇదే జరుగుతోంది.

బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించనున్న సినిమా గురించి వెయ్యి కోట్ల లెక్కలు వేసెయ్యడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ ప్రచారమే చాలా రిస్కీ అటెంప్ట్. ఎందుకంటే, బుచ్చిబాబు సన జస్ట్ సింగిల్ సినిమా డైరెక్టర్ ప్రస్తుతానికి. అలాగని అతన్ని తక్కువ అంచనా వేయలేం.

ఓటీటీ సంస్థలు కూడా సినిమాల లెక్కలపై ఒకింత అప్రమత్తమయిన దరిమిలా, కాస్ట్ కటింగ్ దిశగా పెద్ద సినిమాలు ఆలోచన చేయాల్సి వుంది. గ్లోబల్ సినిమా అయినాగానీ, బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడితే అందరికీ మంచిదన్న చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.