ప్ర‌భాస్ ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చ‌ర‌ణ్‌.. ఇది మ‌నంద‌రి ప్రాథ‌మిక కర్త‌వ్యం అంటున్న చెర్రీ

రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు, హీరోయిన్స్, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, ర‌చయిత‌లు, టీవీ ఆర్టిస్ట్‌లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. తెలంగాణ‌ని ప‌చ్చని ప్ర‌కృతి వ‌నంగా మార్చేందుకు సంతోష్ కుమార్ చేప‌ట్టిన ఈ య‌జ్ఞం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుండ‌డం హ‌ర్ష‌ణీయం.

కొద్ది రోజుల క్రితం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటారు. అలానే 1600 ఎకరాల అడివిని ద‌త్త‌త తీసుకున్నారు. ప్ర‌కృతిని కాపాడుకోవ‌డం మ‌నంద‌రి ధ్యేయం అని చెప్పిన ప్ర‌భాస్ ఈ ఛాలెంజ్‌ని రామ్ చ‌ర‌ణ్‌కు విసిరారు. తాజాగా ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాంచరణ్ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సీజ‌న్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొద‌లు పెట్టిన ప్ర‌భాస్‌.. నాకు ఈ మొక్క‌లు నాటే అవ‌కాశాన్ని అందించ‌డం సంతోషంగా ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. ప్ర‌కృతి స‌మ‌తుల్యంతో ఉంటేనే మ‌నమంద‌రం సంతోషంగా ఉంటాం. భూమి మీద జీవించ‌గ‌లుగుతాం. లేదంటే ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. దీనిని గ్ర‌హించిన జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ఎన్నో ల‌క్ష‌ల మందిలో స్పూర్తిని క‌లిగించి మొక్క‌లు నాటిస్తున్నారు. ఆయ‌న‌కు నా మ‌న‌స్పూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. అలానే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలీయా బట్, దర్శకుడు రాజ‌మౌళి,తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమురం భీంగా క‌నిపించ‌నున్నాడు.