సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే, ఆయన ఫ్యాన్స్ కూడా అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమా చివరి దశకు చేరుకుందని, ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంతలోనే జైలర్ 2 అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ టీజర్ తో అదరగొట్టారు. రజినీ ఎనర్జీ చూసిన అభిమానులు ఖుషీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు కొత్త గాసిప్ ఫ్యాన్స్ లో కాస్త నిరాశ కలిగిస్తోంది. కోలీవుడ్ లోని ప్రతిష్టాత్మక దర్శకుల్లో ఒకరైన వెట్రిమారన్ రజినీకి ఓ కథ వినిపించారని, ఆ కథకు రజినీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ 2 తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. అయితే ఇదే విషయంలో అభిమానులు అంతా ఒక్కటిగా ఓ వాదన చేస్తున్నారు.
వెట్రిమారన్ సినిమాలు ఎక్కువగా సామాజిక సమస్యల ఆధారంగా ఉండటమే కాకుండా, కొందరి అభిప్రాయం ప్రకారం అవి కాస్తా ప్రొపగాండా తరహా సినిమాలుగా మారతాయని చెబుతున్నారు. కాలా, కబాలి సినిమాలు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కినప్పుడు కూడా రజినీ ఇమేజ్ కు పెద్దగా ఉపయోగపడలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వెట్రిమారన్ కూడా అలాంటి జోనర్ లో సినిమా చేస్తే, తలైవా ఫ్యాన్స్ కొంత నిరాశ చెందే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం వెట్రిమారన్ కంటెంట్ పరంగా ఎప్పుడూ కొత్తదనాన్ని చూపిస్తాడని, రజినీతో కచ్చితంగా ఒక ల్యాండ్‌మార్క్ మూవీ ఇస్తాడని నమ్ముతున్నారు. విధుతలై, అసురన్ లాంటి సినిమాలతో వెట్రిమారన్ తన స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లాడని, రజినీని మరింత పర్‌ఫార్మెన్స్ ఆరెనాలో చూపించగలడని ఆశిస్తున్నారు.
ఇప్పుడు ఈ చర్చలన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టేది అధికారిక ప్రకటన మాత్రమే. రజినీకాంత్ నిజంగానే వెట్రిమారన్ తో కలిసి సినిమా చేయబోతున్నారా? లేక ఇది కేవలం గాసిప్ మాత్రమేనా? అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చివరికి, రజినీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆడియెన్స్ ఎప్పుడూ ఆయన వెంటే ఉంటారనడంలో సందేహం లేదు.