తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్‌తో రజినీ అదరగొట్టనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రజినీ ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు వైరల్ అవుతున్నాయి.
‘సరిపోదా శనివారం’, ‘అంటే సుందరానికీ’ లాంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఇప్పుడు రజినీకాంత్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందే ఈ ప్రాజెక్ట్ కోసం వివేక్ ఓ ఆసక్తికర కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
రజినీ ఈ కథను ఇష్టపడితే, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్త అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. వివేక్ ఆత్రేయ స్టైలిష్ నరేషన్, ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథలకు పేరుగాంచాడు, ఇప్పుడు రజినీ లాంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తే ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.