సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరు చెబితే ప్రపంచ దేశాలలో ఉన్న సినీ ప్రేక్షకులు అందరు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులని అలరిస్తున్న రజనీకాంత్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా ప్రజా సేవ చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అనేక ప్రణాళికలు చేసుకోగా, కరోనా అడ్డుపడ్డింది. లేదంటే మదురైలో అక్టోబర్ 2న భారీసభ నిర్వహించి పార్టీ పేరు జెండా ప్రకటించే వారని ఓ వర్గం చెబుతుంది.
రజనీకాంత్‌కు కిడ్నీ సమస్య ఉంది. 2011లో ఈ సమస్యతో బాధపడ్డ ఆయన సింగపూర్‌లో వైద్యం చేయించుకున్నారు. 2016లో ఆ సమస్య మళ్ళీ రావడంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నారు. ఈ విషయం ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. అయితే కిడ్నీ మార్పిడి జరగడం వలన రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సమావేశాలు, చర్చలు జరపాలన్నా కూడా ప్రాణాలతో చెలగాటమే అవుతుంది. అందుకని వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాడని రజనీ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాదే తమిళ నాడు ఎలక్షన్స్ ఉండగా, ఇప్పటి నుండి గ్రౌండ్ వర్క్ చేయకపోతే విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయ పార్టీ ప్రారంభించే ఆలోచన ఉంటే జనవరి 15 లోపే మొదలు పెట్టాలి. డిసెంబర్‌లో తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సోమవారం( నవంబర్ 30)న తన అభిమాన సంఘం అధ్యక్షులతో మీటింగ్ ఏర్పటు చేయబోతున్నారట. దాదాపు 9 గంటలపాటు జరగనున్న ఈ మీటింగ్‌లో రజనీకాంత్ రాజకీయారంగేట్రం గురించి ఏదో ఒకటి అనౌన్స్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది. రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరగనున్న ఈ మీటింగ్‌కు రజనీ మక్కల్ మంద్రం సభ్యులు కూడా తప్పక హాజరు కానున్నారని సమాచారం