సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాటితరం వారికే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నేటి తరం వారికి కూడా ఆయన అభిమాన నటుడు. రాజేంద్రప్రసాద్ హీరో గానే కాకుండా కమెడియన్ గా సపోర్టింగ్ ఆర్టిస్టుగా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎర్రమందారం సినిమాలో ఆయన నటన సామాన్య ప్రేక్షకుల చేత సైతం కన్నీరు తెప్పించింది. ఇకపోతే నటుడు రాజేంద్రప్రసాద్ ఈమధ్య ఒక పాడ్ కాస్ట్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన జీవితంలోని తొలినాళ్ళని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో జరిగిన సంఘటనలని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు.
కెరియర్ తొలినాళ్లలో ఆయనకి సినిమాలు రాక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట. ఆ వివరాలు ఏమిటో ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న రాజేంద్రప్రసాద్ ఆ విషయం తండ్రితో చెప్పటంతో ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదంట. నీ ఇష్టానికి వెళ్తున్నావు కాబట్టి సినిమాల్లో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని చెప్పారని, ఆ మాటలు తనపై ఎంతో ప్రభావం చూపించాయని చెప్పారు రాజేంద్రప్రసాద్.
మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి అక్కడ గోల్డ్ మెడల్ కూడా సాధించానని కానీ అవకాశాలు మాత్రం రాలేదని, తిరుగుటపాలో ఇంటికి వెళితే రావద్దన్నాను కదా మళ్లీ ఎందుకు వచ్చావు అని నాన్న అడగడంతో మళ్లీ ఎంతో బాధతో మద్రాస్ కి వెళ్ళిపోయానని చెప్పారు రాజేంద్రప్రసాద్. ఆ సమయంలో తినడానికి తిండి లేక చేతిలో డబ్బులు లేక మూడు నెలలు అన్నం కూడా తినలేదని, ఆ సమయంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారంట.
అయితే ఒకరోజు నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఏదో గొడవ జరుగుతుందని, తన రూమ్ నుంచి బయటకు వచ్చిన పుండరీకాక్షయ్య గారు తన చేత డబ్బింగ్ చేపించారని, అది నచ్చి సెకండ్ సీన్ కి కూడా తనతోనే డబ్బింగ్ చెప్పించారంట పుండరీకాక్షయ్య గారు. తన దుస్థితి గురించి తాను చనిపోవాలనుకున్న విషయం గురించి పుండరీకాక్షయ్య గారికి చెప్తే ఆయన మందలించి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారంట. ఆ రోజు నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగిన రాజేంద్రప్రసాద్ చెన్నైలోనే ఒక ఇల్లు కట్టుకున్నరని తర్వాత వంశీ పరిచయంతో హీరోగా మారానని చెప్పుకొచ్చారు.