Hero Sreekanth: ఆ సినిమాలో నా స్థానంలో రాజశేఖర్‌ను పెట్టారు.. చాలా బాధపడ్డాను: హీరో శ్రీకాంత్‌

Hero Sreekanth: ఫ్యామిలీ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డా ప్రస్తుతం ఆయన పొజిషనల్ టాప్‌లో ఉండడం చూసి ఆయన ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతారనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. కుటుంబ కథా చిత్రాలతో అభిమానులకు చేరువైన శ్రీకాంత్, సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆరంభంలో కొన్ని సార్లు విలన్ క్యారెక్టర్స్‌ చేయడం తప్పలేదు. అలా ముందుకు సాగుతున్న సమయంలోనే తమ్మారెడ్డి భరద్వాజ తనలో ఏదో టాలెంట్ ఉందని గ్రహించి, హీరోగా అవకాశం కల్పించారని శ్రీకాంత్‌ ఇప్పటికీ గర్వంగా చెబుతుంటారు.

అయితే ఆమె, తాజ్ మహల్ లాంటి చిత్రాలు తన కెరీర్‌కు చాలా ప్లస్‌ మారాయని శ్రీకాంత్ అన్నారు. పెళ్లి సందడి తర్వాత అసలు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని ఆయన ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా తన కెరీర్ మారిపోయిందన్న ఆయన, ఒకానొక సందర్భంలో ఏడాదిలో 13 సినిమాల్లో నటించానని ఆయన చెప్పుకొచ్చారు. పగలు ఒక సినిమా షూటింగ్ చేస్తే, రాత్రి మరో సినిమా షూటింగ్‌లో ఉండేవాడినని ఆయన అన్నారు. ఒక్కో సారి అసలు ఏ సినిమా షూటింగ్‌ చేస్తున్నానో కూడా తెలిసేది కాదని ఆయన నవ్వుతూ తెలిపారు.

అంతే కాకుండా రాజశేఖర్‌ హీరోగా నటించిన వేటగాడు సినిమాలో ముందుగా తననే హీరోగా అనుకున్నారని శ్రీకాంత్ చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తనను పక్కకు తప్పించారని ఆయన వాపోయారు. అంతే కాకుండా ఆ సినిమాలో సౌందర్య, రంభ హీరోయిన్లు అని తెలియగానే చాలా సంతోషపడ్డానన్న శ్రీకాంత్‌, కానీ ఆ తర్వాత తాను ఆ సినిమాలో హీరో కాదు అని తెలిసే సరికి చాలా బాధ పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ తాను చేయకపోయినా, ఓ చిన్న పాత్ర చేసేందుకు మాత్రం తనకు అవకాశం కలిగిందని ఆయన చెప్పారు. ఇకపోతే కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించిన శ్రీకాంత్, ఇటీవల విడుదలైన అఖండ సినిమాలో మళ్లీ విలన్‌గా కనిపించి తన నటనా ప్రతిభను మరోసారి చూపించి, అభిమానులను ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత చేసిన సినిమాల్లో నటించిన శ్రీకాంత్‌కు అఖండ మంచి పేరును తీసుకొచ్చిందని చెప్పవచ్చు.