హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ముఫాసా- ది లయన్ కింగ్’. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ది లయన్ కింగ్’ సినిమాకు ఈ చిత్రం ప్రీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగు వెర్షన్‌లో అగ్ర హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘ముఫాసా’కి బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగులో మహేశ్ తన గాత్రాన్ని అందించారు. అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా పోస్టర్‌ని ఆదివారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఇక ఈ వేడుకకు మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నమ్రత మాట్లాడుతూ.. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.
అందుకే ఈ వేడుకకు రాలేకపోయాడు. ఇది అనుకోకుండా జరిగింది. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ రైడ్. మహేశ్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది.