రాహుల్ సిప్లిగంజ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయనక్కర్లేదు. బిగ్ బాస్ విజేతగా తెలుగు ప్రజల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అంతకు ముందు తన పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో సంగీత ప్రియుల్ని మెప్పించాడు.అయితే బిగ్ బాస్ అనేది మరింత దగ్గర చేసింది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత స్టార్డం వచ్చినా కూడా రాహుల్ సిప్లిగంజ్ ఏనాడు ఆ యాటిట్యూడ్‌ను చూపించలేదు. ఎప్పుడూ నేల మీద నడిచాడు. తాజాగా ఆ విషయం మరో సారి ప్రూవ్ అయింది.
జీ తెలుగులో సింగింగ్ ఐకాన్ అనే కొత్త షో ప్రారంభమైంది. ఈ షోకు స్వరాల పుత్రుడు కోటి, చంద్రబోస్, ఎస్పీ శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో గెస్ట్‌గా వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ కోటి స్వరపరిచిన పాటలన్నంటిని తన స్టైల్లో పాడి నివాళి అర్పించాడు. ఇక దీనిపై కోటి ఎమోషనల్ అయ్యాడు. ఇంతవరకు తనకు నివాళి ఇచ్చిన పర్ఫామెన్స్‌లో ఇదే బెస్ట్ అంటూ సింగర్స్‌లో నెంబర్ వన్ స్థాయికి ఎదిగాడంటూ కోటి కితాబిచ్చాడు.
ఈ సందర్భంగా కోటితో ఉన్న అనుబంధాన్ని రాహుల్ సిప్లిగంజ్ పంచుకున్నాడు. 2006, 2007 నుంచి కోటి గారు తెలుసునని, మధ్య మధ్యలో హెయిర్ కట్, ఫేషియల్ చేయడానికి పిలిచేవాడని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఓ సారి గల్లికా గణేష్ అనే ఆల్బమ్‌ను లాంచ్ చేయడానికి కోటి గారిని పిలిస్తే వచ్చాడని, ఆ క్షణంలో తన దగ్గర డబ్బులు కూడా లేవని, ఇంట్లో నగలు తాకట్టు పెట్టి ఆ ఆల్బమ్ చేశానని రాహుల్ సిప్లిగంజ్ వివరించాడు. ఆయనిచ్చిన సపోర్ట్ ఎప్పుడూ మరిచిపోలేనని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కోటి గారు కూడా ఓ కారణమని, ఆయన లేకుంటే ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదని రాహుల్ ఎమోషనల్ అయి కోటిని ఏడిపించేశాడు. తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ లేని సమయంలో ఆయన తనకు సపోర్ట్ చేశాడని కోటి గురించి రాహుల్ సిప్లిగంజ్ ఎంతో గొప్పగా చెప్పాడు.