తగ్గేదే లే డైలాగ్ ని మించి పుష్ప 2 డైలాగ్… లీక్ చేసిన బన్నీ…?

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్పా సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తో అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లుఅర్జున్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్కి అభిమానులుగా మారిపోయారు. పుష్ప సినిమా అల్లు అర్జున్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఇటీవల అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసుడు సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియచేశాడు. అలాగే సినిమా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా అల్లు శిరీష్ కి మాత్రమే కాకుండా నాకు, మా నాన్న గారికి,మా ఫ్యామిలీ మొత్తానికి చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావటానికి కారణమైన డైరెక్టర్ కి ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ని డైరెక్టర్ కి ఇస్తూ.. ఇంటిలో వెలుగును నింపే ఎలక్ట్రిసిటీ లాగా డైరెక్టర్ కి కూడా పవర్ ఉంటుంది అంటూ చెప్పకొచ్చాడు.ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇలాంటి సినిమా చేయడం ఏ అమ్మాయికైనా చాలా కష్టం. కానీ అను ఇమ్మాన్యుయేల్ ఇలాంటి రిస్క్ తీసుకొన్నందుకు కంగ్రాట్స్ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక శిరీష్ గురించి మాట్లాడుతూ… సినిమా విడుదలకు ముందు మాట్లాడితే తమ్ముడి గురించి గొప్పలు చెబుతున్నానని అనుకుంటారు. అందుకే ఇలా సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నా. శిరీష్ తో పాటు మేమందరం ఈరోజు కోసం ఎంతో ఎదురుచూస్తున్నాము. శిరీష్ హిట్ కొట్టినా కొట్టకపాయినా కూడా తనంటే నాకు ఎప్పటికీ ఇష్టమే. ఈ సినిమాలో శిరీష్ ఫెర్ఫార్మెన్స్ బాగుందని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. పుష్ప లో తగ్గేదేలే అనే డైలాగు కన్నా పుష్ప 2లో అస్సలు తగ్గేదెలే అనే డైలాగ్ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది.. అంటూ పుష్ప2 సినిమాలో డైలాగ్ ని లీక్ చేశాడు.